హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేషం మార్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ఆయన్ను క్షమించరని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. మారాల్సింది బాహ్య వేషం కాదని, ఆయన మైండ్‌సెట్ అని విమర్శించారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడమే బీఆర్ఎస్ నేతలకు పనిగా మారిందని ఎద్దేవా చేశారు. గడ్డం, మీసం పెంచితే రేవంత్ రెడ్డిలా అయిపోతామని కేటీఆర్ భావిస్తే అది పొరపాటని, ఆయన స్వభావంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు.
ఆదిలాబాద్‌జిల్లాకు బీఆర్ఎస్ఏం చేసింది?
ఆదిలాబాద్ పర్యటనలో కేటీఆర్ పూర్తిగా గోబెల్స్ ప్రచారం చేశారని, అనేక అబద్ధాలు మాట్లాడారని వీరేశం మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆదిలాబాద్ రైతులను నిండా ముంచిన రైతు వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ అని ధ్వజమెత్తారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఆదిలాబాద్‌లో గ్రావిటీ ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉండేదన్నారు. కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్‌కు అన్యాయం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ మాటలను విని ఆదిలాబాద్ ప్రజలు నవ్వుకుంటున్నారని, అక్కడ జరిగింది గర్జన కాదని, కేవలం 'తర్జన భర్జన' అని ఆయన సోదరి కవిత చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
రూ.1500 కోట్లు ఖర్చు చేయండి
బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,500 కోట్లు ఉన్నాయని, తెలంగాణ రైతులపై నిజంగానే ప్రేమ ఉంటే ఆ డబ్బును రైతు సంక్షేమం కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అసలు కేసీఆర్ గతంలో కాంగ్రెస్, టీడీపీల్లో పని చేయలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి సోనియమ్మ అని, ఆమె కాళ్లు మొక్కిన చరిత్ర కేసీఆర్‌దేనని గుర్తుచేశారు.
